300 కోట్ల ఉపాధి బిల్లులు విడుదల..పెండింగ్ బిల్లులు రిలీజ్​ చేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకానికి (ఎన్ఆర్ఈజీఎస్) సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఉపాధి పథకంలో వివిధ పనులకు చెల్లించాల్సిన  నిధులు పెండింగ్ లో ఉండగా.. బుధవారం రిలీజ్ చేసింది. పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లకు చెల్లించాల్సిన బకాయిలనూ విడుదల చేసింది. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, ట్రాక్టర్ల మెంటెనెన్స్,  తాగునీటి పైపులైన్ల లీకేజీలు తదితర పనులు మల్టీపర్పస్ వర్కర్లు చేపడుతున్నారు.

కొంతకాలంగా బకాయిలు విడుదల కాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ల బకాయిలు రూ.146 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో నవంబర్ వరకు పెండింగ్​లో ఉన్న వేతనాలు క్లియర్ అవుతాయి.   డిసెంబర్​కు సంబంధించిన వేతనాలు కూడా త్వరలో విడుదల చేయనున్నది. 

బీఆర్కే భవనంలోకి సెర్ప్ కార్యాలయం.. 

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ   (సెర్ప్​) కార్యాలయాన్ని  బీఆర్కే భవనంలోకి షిఫ్టు చేసేందుకు  అనుమతులు లభించాయి. ఈ భవనంలో చిన్నచిన్న  మరమ్మతులు చేపట్టాక కార్యాలయాన్ని తరలించే అవకాశం ఉంది. బీఆర్కే భవన్​లోని  4, 5వ అంతస్తులను సెర్ప్​కు సంబంధించిన విభాగాల కార్యకలాపాలు కొనసాగించేందుకు కేటాయించారు. ప్రస్తుత సెర్ప్​ ఆఫీసు హుడా బిల్డింగ్​లోని హెరిటేజ్ ఆఫీస్ కాంప్లెక్స్​లోని 3, 4 వ అంతస్తుల్లో కొనసాగుతున్నది. ఈ బిల్డింగ్‌కు అద్దె చెల్లింపు సంస్థకు భారంగా మారడంతో ప్రభుత్వానికి చెందిన బిల్డింగ్​లోకి  షిఫ్టు చేయాలని కొంత కాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దీశగా అధికారులు చర్యలు చేపట్టారు.